రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టండి
• ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి
• అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
• మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
• ఇల్లంతకుంట మండలంలో పలు రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
న్యూస్ పవర్ , సెప్టెంబర్ - 20,ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని పలు రోడ్ల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను శనివారం ఆదేశించారు.
ముందుగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి మండలంలోని వంతడుపులకు చేరుకొని గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పురోగతిని పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకొని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
అనంతరం వంతడుపుల నుంచి నారెడ్డిపల్లి రోడ్డును ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ద్విచక్ర వాహనంపై వెళ్లి ..
తాళ్లపల్లిలో రోడ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్ ద్విచక్ర వాహనాలపై వెళ్లారు.
తాళ్లపల్లి నుంచి ముస్కాన్ పేటకు వెళ్లే మట్టి రోడ్డును పరిశీలించారు. కాల్వ పై ఉన్న సీసీ నిర్మాణం ఇటీవల వర్షాలకు దెబ్బతినగా, దానిని పరిశీలించి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. తాళ్లపల్లి నుంచి బేగంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటించగా, పలువురు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామంలోని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటన లో ఈఈ సుదర్శన్ రెడ్డి, పీడీ హౌసింగ్ శంకర్, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
