జనం న్యూస్ , 27 జనవరి, ఇల్లంతకుంట:
సిపిఐ సీనియర్ నాయకుడు, అమరవీరుడు కామ్రేడ్ రొండ్ల మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో నిర్మించతలపెట్టిన భారీ స్థూపం నిర్మాణానికి సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ ఆవిష్కరించారు. అంతకుముందు స్థూప నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంద సుదర్శన్ మాట్లాడుతూ:
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, 1947 మార్చి 14న హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో జరిగిన కాల్పుల్లో 12 మంది అమరులయ్యారని గుర్తు చేశారు.
ఆ 12 మందిలో 6 గురు ఇల్లంతకుంట మండల వాసులే కావడం మనందరికీ గర్వకారణమని, అందులో ఒకరైన కామ్రేడ్ రొండ్ల మాధవరెడ్డి స్వగ్రామమైన రేపాకలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ స్థూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఇల్లంతకుంట మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనిల్, కడారి రాములు, వండాపెల్లి లక్ష్మణ్, దళిత హక్కుల పోరాట సమితి నాయకురాలు పవిత్ర, రాజశేఖర్ రాజు, నరేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
