సోమారంపేటలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
• విజేతలకు బహుమతుల ప్రదానం
న్యూస్ పవర్ , 15 జనవరి , ఇల్లంతకుంట:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమారంపేట గ్రామంలో ముగ్గుల పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కేతిరెడ్డి భారతావ్వ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ పోటీల్లో సుమారు 15 మంది మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల ముగ్గులతో ఆవరణను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వెంకట్రావుపల్లె సర్పంచ్ చల్ల నవీన్, న్యాయవాది కడగండ్ల తిరుపతి, మామిడ్ల కనకరాజు వ్యవహరించారు.
విజేతలు వీరే:
పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోడిసెల రాణి ప్రథమ బహుమతిని కైవసం చేసుకోగా, గైని రుద్రాభిక ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. విజేతలకు చల్ల నవీన్ రెడ్డి తరఫున నగదు బహుమతులను అందజేశారు.
కేవలం విజేతలకే కాకుండా, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేయడం విశేషం. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గైని శ్రీనివాస్, గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
