తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే: సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్
న్యూస్ పవర్ , 13 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి స్మారక స్థూపం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ–ముస్లింల మధ్య కాదని, నిజాం తొత్తులైన పెత్తందారులపై తెలంగాణ ప్రజల పోరాటమని స్పష్టం చేశారు.
ఆయన మాట్లాడుతూ, పోరాట నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బద్దం ఎల్లారెడ్డి ప్రజల్లో చైతన్యం నింపి, జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు నలుగువేల మంది అమరులై, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయబడిందని వెల్లడించారు.
ముషం రమేష్ మరింతగా మాట్లాడుతూ, పటేల్ సైన్యం నిజాంపై పోరాడడానికి రాకుండా, ఈ ప్రాంత ప్రజా పోరాటాన్ని అణచివేయడానికి మాత్రమే వచ్చినదని అన్నారు. రజాకారుల, పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రజలు ఎర్ర జెండా కింద తిరుగుబాటు చేశారని, దానిని అణచివేసేందుకే నాటి పోలీస్ యాక్షన్ ఉపయోగించబడిందని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాన్ని అణచడమే ఆ యాక్షన్ లక్ష్యమని, ప్రజలకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశం అసలుండలేదని ఆయన అన్నారు.
నాటి త్యాగవంతులైన అమరుల పోరాటాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోవద్దు అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కోడం రమణ, జవ్వాజి విమల, గన్నేరం నర్సయ్య, సూరం పద్మ, ముక్తికాంతా అశోక్, గురుజాల శ్రీధర్, సావణపెల్లి రాములు, గరిగే రవి, బిక్షపతి, సామ నరసింహరెడ్డి, అశోక్, సావణపెల్లి ప్రభాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
