గాగిల్లాపూర్ పంచాయతీ కార్యదర్శిని సత్కరించిన ఎమ్మెల్యే
న్యూస్ పవర్ , 25 అక్టోబర్, బెజ్జంకి :
బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్ ను శుక్రవారం మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో శాలువా కప్పి సత్కరించారు. అంతేకాకుండా 1016 రూపాయల నగదు అందజేశారు.
మానకొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామపంచాయతీల్లో రోజువారీగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ , క్లోరినేషన్, మంచినీటి ట్యాంకుల శుద్ధి, వీధి లైట్ల ఏర్పాటు, డ్రైనేజీల క్లీనింగ్, పైప్ లైన్ లీకేజీల నివారణ తదితర మరమ్మతు పనులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఫొటోలతో సహా నిర్ణీత సమయంలోగా అందిస్తున్నందుకు రాజేంద్ర ప్రసాద్ ను ఉత్తమ కార్యదర్శిగా ఎంపిక చేసి సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ ను స్ఫూర్తిగా తీసుకొని మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులుగా కూడా తమ పని తీరును మెరుగుపర్చు కోవాలని, విధి నిర్వహణలో అలసత్వం వీడి నూతన ఉత్సాహంతో పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గె దామోదర్, ముక్కిసా రత్నాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
