JSON Variables

పంట క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు



పంట క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
జనం న్యూస్, 13 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలస శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ ఇల్లంతకుంట  వారితో కలిసి వంతడుపుల, కట్కురు, పొత్తురు గ్రామాలలో రైతుల ప్రత్తి, వరి మరియు మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రత్తి శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది. గత రెండు రోజులుగా కురిసిన అధిక వర్షాల వలన ప్రత్తి పంటలో పార విల్ట్ (వడలు తెగులు) గమనించడం అయినది. దీని నివారణకు పై పాటుగా లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల 19:19:19 లేదా 13:0:45 లాంటి స్థూల పోషకాలను మరియు 5 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని వారం-పది రోజుల వ్యవధిలో కనీసం రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే కాపర్ ఆక్సి క్లోరైడ్ మందుని 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకుని మొక్కల మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ప్రస్తుత  పరిస్థితులలో గులాబీ రంగు పురుగు ఉదృతిని గమనించ డానికి ఏకరానికి 4 లింగాకర్షక బుట్టలను ప్రతి ఒక్క రైతు సామూహికంగా అమరుచకొవాలి.ఆదేవిదంగా గుడ్డి పువ్వులను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి. ముందస్తు  నివారణకు వేపనూనె (1500 పి. పి. యమ్) @ 5 మి.లీ. (లేదా) ప్రోఫెనొపాస్ @ 2 మి.లీ. (లేదా) థయోడికార్బ్ @ 1.5 గ్రాములు (లేదా) క్లోరిపైరి పాస్ @ 2.5 మి.లీ.  క్వీనాల్ పాస్ @ 2 మి.లీ.  లీటరు నీటికి  కలిపి పిచికారి చేయాలి. మందులను ఉదయం పూట గాని, సాయంత్రo పూట గాని పిచికారి చేసుకోవాలి.  అదేవిధంగా వరిలో రైతులు సాగు చేస్తున్న క్షేత్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.
ప్రస్తుతం వరి పంట పిలకల దశ నుండి అంకురం దశలో ఉంది. ముందుగా వేసిన వరి చిరుపొట్ట దశలో ఉంది. పిలక దశలో ఉన్న వరి పైర్లలో ఎకరానికి 30-35 కిలోల యూరియా మరియు 15 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఎరువుని వేసుకోవాలి. పిలక దశలో ఉన్న వరి పైర్లు సరిగా ఎదగక పోవడం గమనించినట్లయితే పై పాటుగా వేసే యూరియా తో పాటుగా కార్బెన్డజిమ్ + మాంకోజెబ్ 2.5 - 3.0 గ్రాములు కిలో యూరియాకి పొలంలో సమానంగా బురద పదనులో చల్లుకోవాలి. ప్రస్తుతం కాండం తొలిచే పురుగు యొక్క రెక్కల పురుగు ఉదృతి అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అంకురం నుండి చిరు పొట్ట దశలో ఉన్న వరి పైర్లలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ. అను మందుని ఎకరానికి పిచికారీ చేయాలి. కాటుక తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు ప్రోపికొనజోల్ 1 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినచో లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. చొప్పున సుడుల భాగం తడిచేటట్లు సాయంకాలం వేళల్లో పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను పెట్టుకోవాలి. వరి తవుడు 10 కిలోలు+బెల్లం 2 కిలోలు+2-3 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు పులియనిచ్చి మరుసటి రోజు థయోడికార్బ్ 100 గ్రాములు కలిపి ఉండలుగా తయారుచేసి సాయంకాలం వేళల్లో మొక్కల సుడులలో వేయాలి. ఈ క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక కేంద్రం, కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి, శాస్త్రవేత్త డా. రాజేంద్రప్రసాద్ మరియు పొలస శాస్త్రవేత్తలు డా. ఎస్. ఓంప్రకాష్, డా. ఎన్. బలరాం, డా. కృష్ణ చైతన్య, డా. మధుకర్, డా. సాద్వి మరియు మండల వ్యవసాయ విస్తరణ అధికారి రవలి మరియు రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments