ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
న్యూస్ పవర్, 10 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా 'బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్' కోశాధికారి శ్రావణపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ఫెడరేషన్ భవనంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా శ్రావణపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా వ్యవసాయ బావుల మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని, మనం మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్న తరహాలోనే డబ్బులు కడితేనే నీళ్లు వచ్చేలా కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయం చేయలేక, కూలీలుగా మారి బానిస బతుకులు బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు రైతులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఏకమై, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ సమస్యలపై సామాన్యులకు అర్థమయ్యేలా గడప గడపకు వెళ్లి కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని, ప్రజలంతా మమేకమై ఇల్లంతకుంట ప్రాంతానికి భారీగా తరలివచ్చి సమ్మెను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జక్కుల నాగరాజు, చిట్యాల శ్రీనివాస్, సొల్లు అర్జున్, సొల్లు రమేష్, ఎలుకల వర్ధత్, ఎలుకల నిఖిల్ మరియు ఇల్లంతకుంట మండల భవన నిర్మాణ, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
