బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేద్దాం
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సర్వతోముఖాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కళాశాల పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉదయం 11 గంటలకు కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాలలో చదివి ప్రస్తుతం వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు పాల్గొన్నారు. పోలీసు విభాగం నుంచి ఒకరు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రైవేటు విద్యా సంస్థలు నడిపిస్తున్న నిర్వహణ దారులు, రాజకీయ ప్రముఖులు హాజరై తాము గతంలో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి ఈ స్థాయికి చేరుకున్నామని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్తుతం జాతీయస్థాయి గుర్తింపు కోసం వెళ్లనుండడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. కళాశాలకు మంచి గుర్తింపు లభించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కళాశాలలో చదివిన విద్యార్థులు తమ వంతు సహకారాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తాము అందిస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 14న ఆదివారం మరోసారి తాము సమావేశం కానున్నట్లు తెలిపారు. వివరాలకు పూర్వ విద్యార్థుల కోఆర్డినేటర్ కాంపల్లి శంకర్ గారిని 9959269975 నెంబర్ లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ ఎం. గోపాల్, కళాశాల పూర్వ విద్యార్థుల కోఆర్డినేటర్ కాంపల్లి శంకర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.