రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి – యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన
• పొత్తూరు గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన
న్యూస్ పవర్, 10 అక్టోబర్ , ఇల్లంతకుంట:
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం), కరీంనగర్ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం లో భాగంగా మహాత్మా జ్యోతిభ పులే వ్యవసాయ కళాశాల, కరీంనగర్ విద్యార్థులు పొత్తూరు గ్రామంలోని రైతువేదిక వద్ద రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాసంగి పంటల ప్రణాళికపై రైతులు మరియు శాస్త్రవేత్తల మధ్య చర్చా గోష్ఠి జరిగింది.
రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, శాస్త్రవేత్తల సూచనలను పాటించడం ద్వారా ఎక్కువ దిగుబడులు పొందవచ్చని సూచించారు.
అలాగే వ్యవసాయ పరిశోధన సంచాలకుడు డా. బి. రాంప్రసాద్ రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు పంటల సరళిని మార్చుకోవాలని, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు ద్వారా లాభాలు సాధించవచ్చని తెలిపారు.
అసోసియేటెడ్ డీన్ డా. వి. నరసింహ రెడ్డి పంటల మార్పిడి, సరైన యాజమాన్య పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు.
డా. ఇ. ఉమారాణి నూతనంగా ఆవిష్కరించిన వంగడాల రకాలను పరిచయం చేయగా, డా. హరికృష్ణ యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగు, ఎరువుల వినియోగం గురించి విశదీకరించారు.
డా. ఎమ్. రాజేంద్ర ప్రసాద్ పంటలలో చీడపీడల నియంత్రణపై అవగాహన కల్పించారు.
వ్యవసాయ ప్రదర్శనలో విద్యార్థులు వివిధ వ్యవసాయ మోడళ్లు ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో డా. హరి కృష్ణ, డా. రాజేంద్రప్రసాద్, డా. బి. రాంప్రసాద్, డా. ఇ. ఉమారాణి, డా. వి. నరసింహ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సౌమ్య కీర్తి, శ్రీజ, మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు లలిత, రవళి, అర్చన, అలాగే ఉత్తమ రైతులు రవీంద్ర రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
