రాకేష్ కిషోర్ పై తక్షణ విచారణ చేపట్టాలి
న్యూస్ పవర్ , 11 అక్టోబర్ , ఇల్లంతకుంట:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆ దాడిని దేశ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంద రాజు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
దాడి చేసిన రాకేష్ కిషోర్ పై లోతైన విచారణ జరిపి, తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న న్యాయమూర్తిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దాడికి నిరసనగా మరియు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 13న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు సావనపెల్లి రాకేష్ మాదిగ ప్రకటించారు.
ఇల్లంతకుంట మండలంలోని ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుండ్రేడ్డి రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి సావనపెల్లి శంకర్ మాదిగ, సీనియర్ నాయకులు కాసుపాక శంకర్ మాదిగ, సావనపెల్లి ప్రభాకర్ మాదిగ, కాసుపాక రమేష్ మాదిగ, సావనపెల్లి రాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
