సైబర్ నేరగాళ్లను మించిన 'ఇసుక' దొంగలు.. లబ్ధిదారులకు తెలియకుండానే ఆధార్‌తో మాయాజాలం!
ఇల్లంతకుంట, ఏప్రిల్ 17 (న్యూస్ పవర్):
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు అందజేసిన ఆధార్ కార్డులు, ప్రొసీడింగ్ పత్రాలను అక్రమార్కులు ఆయుధంగా చేసుకుంటున్నారు. లబ్ధిదారులకు కనీస సమాచారం లేకుండానే వారి పేరుతో ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
వెలుగులోకి వచ్చిన వైనం:
సోమవారంపేట గ్రామానికి చెందిన ఒక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి పేరుతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక బుక్ చేశారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు లబ్ధిదారుడికి ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తనకు తెలియకుండానే తన పత్రాలను వాడుతున్నారని తెలుసుకున్న బాధితుడు విస్మయానికి గురయ్యాడు.
మోసం జరుగుతోందిలా:
పాత పత్రాల దుర్వినియోగం: గతంలో పర్మిషన్ కోసం ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చిన జిరాక్స్ కాపీలను ఇసుక ట్రాక్టర్ల యజమానులు, మధ్యవర్తులు సేకరించి భద్రపరుచుకున్నారు.
ధరల వ్యత్యాసమే పెట్టుబడి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 250 లకే ఇసుక పర్మిషన్ లభిస్తుంది (6 ట్రిప్పుల వరకు). అదే సాధారణ వ్యక్తులకు రూ. 800 వరకు ఖర్చవుతుంది. ఈ వ్యత్యాసాన్ని సొమ్ము చేసుకోవడానికి మాఫియా లబ్ధిదారుల పేర్లను వాడుకుంటోంది.
ఫోన్ నంబర్ల మాయ: బుకింగ్ సమయంలో లబ్ధిదారుల ఆధార్ వాడుతున్నప్పటికీ, ఫోన్ నంబర్లు మాత్రం ట్రాక్టర్ యజమానులవి ఇస్తూ ఓటిపిల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా మేనేజ్ చేస్తున్నారు.
చట్టపరమైన చర్యలు తప్పవు:
ఈ తరహా చర్యలు Identity Theft (గుర్తింపు దొంగతనం) కిందికి వస్తాయి.
IT Act 2000 (సెక్షన్ 66C): ఇతరుల గుర్తింపును దొంగిలిస్తే 3 ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా.
ఆధార్ చట్టం 2016: ఆధార్ వివరాల దుర్వినియోగం సెక్షన్ 37, 40 కింద తీవ్రమైన నేరం.
నిరుపేదల సొమ్మును, ప్రభుత్వ రాయితీని అడ్డదారిలో దోచుకుంటున్న ఇసుక మాఫియాపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు.

