గ్రామీణ యువత అభివృద్ధికి 'యువ మండల్ వికాస్ అభియాన్' - ఉమ్మడి జిల్లా డివైఓ వెంకట రాంబాబు
అనంతారం (రాజన్న సిరిసిల్ల): గ్రామీణ యువతను ఏకం చేసి, వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా 'మై భారత్' మరియు శ్రీకృష్ణ యూత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అనంతారం గ్రామంలో "యువ మండల్ వికాస్ అభియాన్" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గత 5 రోజులుగా 50 గ్రామాల్లో ఈ అవగాహన యాత్రను కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా అనంతారం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డివైఓ వెంకట రాంబాబు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో యువజన సంఘాలను బలోపేతం చేయడమే ఈ వికాస్ అభియాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. యువజన సంఘాలు లేని గ్రామాల్లో కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసి, వాటిని 'మై భారత్' ఉమ్మడి జిల్లా విభాగాలకు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో గ్రామీణ యువతకు ప్రాధాన్యత లభిస్తుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ ఆర్గనైజర్ అక్కేం నాగరాజు, అనంతారం గ్రామ సర్పంచ్ ఒల్లల రజిత వెంకటేష్, ఉపసర్పంచ్ కదం జయంత్, వార్డ్ సభ్యులు అక్కేం ఉపేందర్, మల్యాల రాజశేఖర్, బట్టి క్రాంతి, శిలాపురం రమేష్ పాల్గొన్నారు. అలాగే యువజన సంఘం సభ్యులు బొల్లం శ్రీకాంత్, బండారి వెంకటేష్, గోనెపెల్లి వెంకటేష్, ఒల్లల కృష్ణకుమార్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామీణ యువత పాల్గొన్నారు.

