ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి.. దీర్ఘకాలంపాటు ఆదాయం
• ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
న్యూస్ పవర్ , 3 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా రైతులు అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని సాధించవచ్చని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా మంగళవారం ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు.
మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఇంచార్జి కలెక్టర్, ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వ సహకారం, సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు, భవిష్యత్లో వచ్చే ఆదాయం, తదితర అంశాలపై వివరించారు.
మెగా ప్లాంటేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో కలిపి మొత్తం 32 మంది రైతుల ద్వారా 110 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని, ప్రణాళిక ప్రకారం విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు.
ఆయిల్ పామ్ పంట సాగు ఆవశ్యకతను, అధిక దిగుబడి, లాభాలను తెలుసుకుని ఆసక్తితో ముందుకు వచ్చిన రైతులను ఇంచార్జి కలెక్టర్ అభినందించారు. ఆయిల్ పామ్ సాగుకు ఇక్కడి రైతులు తీసుకున్న నిర్ణయం ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని, మీ అనుభవాలను పక్క గ్రామాల రైతులతో పంచుకుని ఆయిల్ పామ్ పంట సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.
ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తితో ముందుకు రావాలని, ఈ పంట అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుదని, నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి, ఆదాయం వస్తుందని వెల్లడించారు.
జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు పీఏసీఎస్ లకు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ ఏఓలకు, ఏఈవోలకు లక్ష్యం కేటాయించామని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లా యంత్రాగం ఆద్వర్యంలో జిల్లా కేంద్రం, వివిధ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో లాభాలు ప్రభుత్వ సహకారం, సబ్సిడీలు వివరిస్తూ.. కరపత్రాలు సిద్ధం చేసి పంపిణీ చేయించామని, బోయినపల్లి మండలంలో ఇప్పటికే సాగు చేసిన రైతులతో సమావేశాల్లో మాట్లాడించి.. అవగాహన కల్పించామని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు మన జిల్లా నుంచి గత నెల 19వ తేదీన ఆయిల్ పామ్ సాగు, ఫ్యాక్టరీ సందర్శనకు సుమారు 50 మంది రైతులను పంపించామని, సందర్శన అనంతరం ఆ రైతులు సాగుపై సంతృప్తి వ్యక్తం చేయడం తోపాటు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు.
జిల్లాలో గత సంవత్సరం జూలై నుంచి ఇప్పటి దాకా 67 మంది రైతుల నుంచి 257 ఎకరాల్లో 110 టన్నులు ఆయిల్ పామ్ పంటను సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఒక్కో టన్నుకు రూ.20,456 మద్దతు ధర ప్రస్తుతం ఉందని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఎక్కువ మంది కూలీలు అవసరం లేదని, నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుందని తెలిపారు. పంట విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందని వెల్లడించారు. మిగితా అన్ని పంటలతో పోలిస్తే దీని సాగుతో ఎన్నో లాబాలు ఉన్నాయని, అటవీ జంతువుల బాధ ఉండదని, పర్యావరణ సమస్యలతో ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అంతర పంటలుగా కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు.
అనంతరం వల్లంపట్ల గ్రామంలో 2022 సంవత్సరంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి పంటను సాగు చేస్తున్న తీరును ఇంచార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతును అడిగి సాగు వివరాలను ఆరా తీశారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ ఫారూక్, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.
