త్వరలో ఆర్టీసీ బస్సు సర్వీసులు: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
- ఇల్లంతకుంట - సిద్దిపేట, కరీంనగర్ మార్గాల్లో బస్సులు నడపాలని వినతి
- మంత్రిని కలిసిన సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు
న్యూస్ పవర్, 4 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
ప్రయాణికుల సౌకర్యార్థం ఇల్లంతకుంట నుండి సిద్దిపేట మరియు కరీంనగర్ మార్గాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించాలని కోరుతూ వెంకట్రావుపల్లె సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మంద రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గతంలో ఇల్లంతకుంట నుండి సిద్దిపేట వరకు అందుబాటులో ఉండి, ప్రస్తుతం నిలిచిపోయిన బస్సు సర్వీసును (4 ట్రిప్పులు) తిరిగి పునఃప్రారంభించాలని కోరారు. అదే విధంగా కరీంనగర్ నుండి బెజ్జంకి మీదుగా ఇల్లంతకుంటకు 3 ట్రిప్పుల బస్సు సర్వీసును నడిపించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వచ్చే 10 రోజుల్లోగా కచ్చితంగా ఈ మార్గాల్లో బస్సు సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మామిండ్ల కనకరాజు, ఉమ్మెంతల సంపత్ రెడ్డి, బత్తినీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
