బీఆర్ఎస్ కు సింగిల్ విండో చైర్మన్లు గుడ్ బై
• ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక
• కండువాలు కప్పిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
న్యూస్ పవర్ ,18 ఆగస్ట్ : మానకొండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారాయి. ఆ పార్టీకి చెందిన నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ మండలా నుంచి మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా ఆ పార్టీకి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో వారంతా సోమవారం హైదరాబాద్ లో టిపిసిసి అధ్యక్షులు , ఎం ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఇల్లంతకుంట మండలం గాలిపల్లి సింగిల్ విండో చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి, శంకరపట్నం మండలం తాడికల్ సింగిల్ విండో చైర్మన్ కేతిరి మధుకర్ రెడ్డి, మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ అనభేరి రాధాకిషన్ రావు, మానకొండూర్ సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, దేవంపల్లి సింగిల్ విండో చైర్మన్ కసిరెడ్డి లలిత-ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ములకనూరు విశాల సహకార పరపతి సంఘం తర్వాత రెండో అతిపెద్దగా గుర్తింపు పొందిన గట్టుదుద్దెనపల్లి సంఘ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉండటం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అందిస్తున్న ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతుపక్షంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చడంతోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా సదరు విండో చైర్మన్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందించడంలో విఫమైనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆందోళనలు చేయిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్లే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ సత్తు మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, నుస్తులాపూర్ సొసైటీ అధ్యక్షులు గుజ్జుల రవీందర్ రెడ్డి, డైరెక్టర్ అలువాల కోటి తదితరులు పాల్గొన్నారు.
