ఆలయ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి
• కొత్త పాలకవర్గానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి హితవు
• శ్రీ ముత్యాల పోచమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్ గా అంతగిరి
• సభ్యులుగా మరో ఆరుగురి ప్రమాణం
న్యూస్ పవర్, 18 ఆగస్ట్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం అంతగిరి గ్రామంలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ అభివృద్దే లక్ష్యంగా కొత్త పాలకవర్గం కృషి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. సోమవారం మండలంలోని అంతగిరి శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ నూతన చైర్మన్ గా కోలపురి అంతగిరి, సభ్యులుగా గొట్టపర్తి ముత్యం, చెన్ని పోచవ్వ, కుంబం ముత్తయ్య, మిరిదొడ్డి శంకరయ్య, ఎల్కపల్లి మల్లయ్య, పల్లె తిరుపతిరెడ్డిల ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త పాలవర్గం ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంతో మహిమగల ఈ ఆలయానికి చుట్టుపక్కల మండలాలను భక్తులు ఇక్కడి వస్తుంటారని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి గురికాకుండా వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలయం ఇప్పటికే అభివృద్ధి చెందాల్సి ఉండేదని, అయితే ఈ ప్రాంతం ముంపునకు గురికావడం, ఆలయానికి కమిటీ లేకపోవడం వంటి కారణాలతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆలయ అభివృద్ధికి ఎవరేమీ చేయకున్నా ప్రభుత్వం మాత్రం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పాలకవర్గ సభ్యులంతా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధి, వసతుల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రిని కలిసి నివేదిస్తామని, జిల్లాస్థాయిలో కలెక్టర్ సహాయాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ ,సభ్యులు భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఆలయ అభివృద్ధి తోడ్పడతారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అభిలషిస్తూ నూతన పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
పూర్ణకుంభంతో స్వాగతం
ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలతోపాటు ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మారుతీరావు, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఎలగందుల ప్రసాద్, పసుల వెంకటి, జువ్వాడి మన్మోహన్, ఆనంద్ రెడ్డి, జ్యోతి, విజయలక్ష్మి, తీగల పుష్పలత, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
