మైత్రీ ఛానల్ అధినేత కొత్త జయపాల్ రెడ్డి పై సీపీకి యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా అవాస్తవాలతో కూడిన కథనాలను ప్రసారం చేస్తున్న మైత్రీ ఛానల్ పైన, దాని యజమాని కొత్త జయపాల్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ లు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల కొంతకాలంగా మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై పథకం ప్రకారం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అందులో భాగంగా మైత్రీ ఛానెల్ యజమాని కొత్త జయపాల్ రెడ్డి ఎమ్మెల్యేపై దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో ఉన్న రాజకీయపరమైన విభేదాలను దృష్టిలో పెట్టుకొని కొత్త జయపాల్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా తన సొంత ఛానెల్ మైత్రీలో తప్పుడు కథనాలను ప్రసారం చేయిస్తున్నారని వారు ఆరోపించారు. మానకొండూర్ నియోజకవర్గం లోనే కాకుండా బయటి జిల్లాల్లో జరిగిన సంఘటనలు సైతం ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఇటీవల మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్త తప్పుడు పనికి పాల్పడినట్టుగా ఆరోపణలు రాగా,దాన్ని ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ మైత్రీ ఛానెల్ లో తప్పుడు ప్రసారం చేశారని,అలాగే వరంగల్ జిల్లాలో సీఐ రవికుమార్ అనైతిక చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని, సీఐ రవికుమార్ తో మానకొండూర్ ఎమ్మెల్యేకు ఎలాంటి పరిచయం లేనప్పటికీ ఆయన చేసిన తప్పిదాన్ని ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ మైత్రీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని వారు పేర్కొన్నారు. దురుద్దేశంతో చేస్తున్న తప్పుడు కథనాల ప్రసారం వల్ల ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ వైద్యుడిగా పేదలకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నారని, సేవా దృక్పథంతో డాక్టర్ సత్యనారాయణ,వారి సతీమణి డాక్టర్ అనురాధతో కలిసి హైదరాబాద్ లో రెండు ఆస్పత్రులను నిర్వహిస్తున్నారని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు మరింత మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారని వారు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి ముందుకు సాగుతున్న డాక్టర్ కవ్వంపల్లిపై అభాండాలు మోపుతా నిరాధారమైన కథనాలు ప్రసారం చేయడం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నకొత్త జయపాల్ రెడ్డి పైన, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మైత్రీ ఛానెల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోగలరని పులి కృష్ణ, అల్లూరి శ్రీనాత్ రెడ్డి, అంతగిరి వినయ్ కుమార్ సీపీని కోరారు.
0 Comments