JSON Variables

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే పకడ్బందీగా చేపట్టాలి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే పకడ్బందీగా చేపట్టాలి


డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలి
- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 న్యూస్ పవర్ , 25 ఆగస్టు , ఇల్లంతకుంట :
వర్షాకాలం నేపథ్యంలో పట్టణాల్లో, గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సీజనల్, కీటకజనిత వ్యాధుల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల మూలంగా ఎన్నో రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకునే విధంగా వైద్యాధికారులు అవగాహన కల్పించాలని  సూచించారు. 
బహిరంగ ప్రదేశాల్లో నిలిచిన మురికి నీరు, పాత టైర్లు, నీటి సంప్లు, పడేసిన డబ్బాలు, నిల్వ ఉండే వాటిలో డెంగీ కారకాలైన దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, పంచాయతీ అధికారులు పారిశుధ్యంపై డ్రై డే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించి నీటి నిలువలు లేకుండా ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డ్రై డే నిర్వహించిన ప్రతిరోజు కనీసం 100 ఇండ్లను రిసోర్స్ పర్సన్, ఏఎన్ఎం లు ,ఆశా లు సందర్శించి డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం 80 శాతంకు తగ్గకుండా సంస్థాగత ప్రసవాలు జరిగేలా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నందున ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్ లు, ఏఎన్ఎం, ఆశాలు లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. 
ప్రతి గర్భిణీ నమోదు కావాలని, నమోదు అయిన వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయ్యే వరకు పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణులు నూరు శాతం నమోదు అయ్యేలా ప్రధానంగా గర్భిణులకు మూడు,నాలుగు ఆంటినెంటల్ చెకప్లు జిల్లా ఆసుపత్రిలో చేయించే విషయంపై దృష్టి సారించాలన్నారు. తొలి కాన్పు సాధ్యమైనంత పేర సాధారణ ప్రసవం అయ్యేలా వైద్యాధికారి ప్రత్యేక చూపాలన్నారు. వారిని ఫోన్ ద్వారా సంప్రదించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న వైద్య సేవల వివరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 
ఆరోగ్య మహిళా కార్యక్రమం భాగంగా పరీక్షలకు వచ్చే  మహిళలకు లక్షణాల ఆధారంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆరోగ్య మహిళ కింద చేసే రెఫెరల్ కేసులను ఫాలో అప్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మెడికల్ ఆఫీసర్లకు కలెక్టర్ సూచించారు.
నిర్మాణ పురోగతిలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. కళాశాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సదుపాయం కల్పించాలని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 
ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, ఆర్&బి ఈఈ శ్యామ్ సుందర్, ఉప వైద్యాధికారులు డా. శ్రీరాములు, డా.రజిత, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, ఇమ్మ్యూనైజేషన్ ఆఫీసర్ డా.మహేష్, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.



లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments