JSON Variables

రైతుల నోట్లో మట్టికొట్టడానికే కేంద్రం చట్టాలు తెస్తుంది

రైతుల నోట్లో మట్టికొట్టడానికే కేంద్రం చట్టాలు తెస్తుంది


-మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
-సెస్ ఎన్నికల్లో రవిందర్ రెడ్డి గెలుపు ఖాయం
-కల్లాల డబ్బులను కేంద్రం వెంటనే రైతులకు విడుదల చేయాలి

 న్యూస్ పవర్, 23 డిసెంబర్ , ఇల్లంతకుంట:

రైతుల నోట్లో మట్టి కొట్టడానికే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ రైతువ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారన్నారు. రైతులు ఉపాధిహామీ పథకం ద్వారా పొలాల వద్ద కల్లాలు నిర్మాణం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల  నుంచి రైతులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధాని, అంబానీలకు కొమ్ముకాస్తుందని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 8 ఎల్ల కాలంలో దేశం అప్పుల పాలయిందని, స్విస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెచ్చి పేదలకు అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో మూడున్నర ఏళ్ళ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారని అన్నారు.సీమాంధ్ర పాలనలో గుక్కెడు నీళ్ల కోసం తెలంగాణ రైతులు ఇబ్బందులు పడేవారని, నీళ్లు లేక వ్యవసాయం మూలనపడి 2014కు ముందు తెలంగాణా రైతులు గల్ఫ్, ముంబాయి వెళ్లి బ్రతుకు బండిని లాగించేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ రైతుల బ్రతుకులు మారాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని, తెలంగాణ లో వ్యవసాయం పండుగగా మారిందని అన్నారు. తెలంగాణ లో ఒరిస్సా, బీహార్,  పశ్చిమ బెంగాల్, ప్రాంతాల నుంచి వలస వచ్చి కూలీలు పనులు చేస్తున్నారని అన్నారు.

రైతుబందు పథకం ద్వారా రైతులకు ఎకరాకు₹10 వేల పెట్టుబడి సాయం అందిస్తూ సీఎం కేసీఆర్ రైతులకు పెద్ద దిక్కుగా మారినారన్నారు. రైతుభీమా పథకం ద్వారా రైతులకు ₹5లక్షల బీమా సదుపాయం కల్పించి రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు.ఈ యాసంగి పంటకు సంబంధించిన రైతుబందు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందించి సీఎం కేసీఆర్ అవ్వా,తాతలకు పెద్దకొడుకయ్యారని అన్నారు.దేశ చరిత్రలోనే సీఎం కేసీఆర్ వృద్ధులు, వికలాంగులు,వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందించి పెద్ద దిక్కుగా మారినారన్నారు .

ఇల్లంతకుంట సెస్ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన మల్లుగారి రవిందర్ రెడ్డి టార్చి లైట్ గుర్తుపై ఓటర్లు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసి చైర్మన్ మామిడి సంజీవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు చెరుకు పల్లి రాజిరెడ్డి, పీఏసీ ఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి.సలీం,వడియాల సత్యనారాయణ రెడ్డి నాయకులు ఎండి.ఉస్మాన్, రఘు, శంకర్లింగం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments