పేదల సంక్షేమానికే సర్కార్ పెద్దపీట
న్యూస్ పవర్ , సెప్టెంబర్ 20, ఇల్లంతకుంట: సంక్షేమ పథకాల అమలులే రాష్ట్ర ప్రభుత్వం పేదలకే పెద్దపీట వేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శనివారం ఆయన ఇల్లంతకుంట మండల పరిషత్ సమావేశమందిరంలో 19 మందికి కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులతోపాటు 51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పేదలకు ఉద్దేశించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అంతేకాకుండా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థికంగా కొంత చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్ ) నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన వివరించారు. గతంలో మాదిరిగా సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదని, త్వరితగతిన ఆర్థిక సహాయాల మంజూరవుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పవ వరకు 19 పర్యాయాలు చెక్కులు పంపిణీ చేశామని ఆయన వివరించారు. 19వ విడుతలో ఇల్లంతకుంట మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు 15.28 లక్షల రూపాయలు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేసినట్టు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల తహశీల్దార్ ఫారుఖ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై.శశికళ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్య యాదవ్, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఎలగందుల ప్రసాద్, పసుల వెంకటి, కోలాపురి అంతగిరి,రజనీకాంత్, వీరేశం, వెంకటరెడ్డి, తీగల పుష్పలత, జ్యోతి, మామిడి రాజు, నేరెళ్ల విజయగౌడ్, అమర్, యాశ్వాడ తిరుపతి, గుంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
