JSON Variables

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి


• సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలి
• జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

న్యూస్ పవర్ , 20 అక్టోబర్ , సిరిసిల్ల:
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, సజావుగా ధాన్యం సేకరణ పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. 
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొనుగోలుపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 258 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 3 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 87 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉంటుందని అన్నారు. 6 వేల 634 టార్పాలిన్లు, 632 పాడీ క్లీనర్ లు, 620 తేమ  కొలిచే మెషీన్ లు, 816 ఎలక్ట్రానిక్ తూకం మెషీన్ లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తమ వెంట వ్యవసాయ విస్తరణ అధికారులచే ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంకు పాస్ బుక్కు, పట్టా పాసు పుస్తకం జిరాక్స్ ప్రతులను వెంట తేవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వాహనాల్లో లోడ్ చేయించి రైస్ మిల్లులకు తరలించాలని, సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. 
సమీక్షలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సహకార ఆధికారి బుద్ధనాయుడు, ఆర్టీఓ కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments