ముంచుకొస్తున్న కరువు ముప్పుపై ముందస్తు ప్రణాళిక అవసరం
• కరువు నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి
•ఎల్‌నినో ప్రభావంపై రైతులను అప్రమత్తం చేయాలి
•వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి
•ఇల్లంతకుంట మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
న్యూస్ పవర్, 24 అక్టోబర్, ఇల్లంతకుంట:
కరోనా అనంతరం ఎల్‌నినో ప్రభావంతో ముంచుకొస్తున్న కరువు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శనివారం ఇల్లంతకుంట మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని, దీంతో కరువు పరిస్థితులు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
*నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత*
అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామసభలు నిర్వహించి, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం గురించి రైతులకు వివరించాలని ఆదేశించారు. పంటల ఎంపిక, సాగు విధానాల విషయంలో రైతులకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు.
రానున్న రోజుల్లో పశువులు, పక్షులు సైతం నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవడం అత్యంత అవసరమన్నారు.
*విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి*
రానున్న రోజుల్లో విద్యుత్ సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు పేర్కొంటూ, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్పంచులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు సమాచారం అందించి, విద్యుత్ వృథాను అరికట్టేలా చూడాలన్నారు.
*విపత్కర పరిస్థితులను సమష్టిగా ఎదుర్కోవాలి*
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం ముఖ్యమని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రభుత్వాలపై నెపం మోపడం సరికాదన్నారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, సమష్టి కృషితోనే సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలమని తెలిపారు.
అంతకుముందు పలువురు సర్పంచులు తమ తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై. శశికళ, మండల తహసీల్దార్ సురేష్, ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి, సర్పంచుల ఫోరం చైర్మన్ మామిడి రాజుతోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments