బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలి: ఏబీవీపీ డిమాండ్
– సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా:
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని చేనేత విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపల్లి రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా హాస్టల్ ఇన్చార్జి పూజ కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ, ఫణి కిషోర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ కేసరి శివ సాయి, నాయకులు నిఖిల్, అరుణ్, లావణ్య, శృతి, స్వాతి, పావని మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

