సిరిసిల్ల టెన్త్ విద్యార్థులకు ఎల్లుండి నుండి సైకిళ్ల పంపిణీ షురూ
• మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
• టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్న కేంద్ర మంత్రి
• జిల్లా కలెక్టర్, ఎస్పీసహా పలువురు ఉన్నతాధికారులు హాజరు
కరీంనగర్ పార్లమంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిర్ స్కూళ్లలో పదవ తరగతి చదువుకునే విద్యార్ధినీ, విద్యార్థులందరికీ ఉచింగా సైకిళ్లను పంపణీ చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అందులో భాగంగా ఈ నెల 15న ఎల్లుండి(మంగళవారం) సిరిసిల్ల జిల్లాలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ‘‘నరేంద్రమోదీ కానుక’’ పేరుతో చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతోపాటు అదనపు కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఈవోతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిసహా పలువురు నాయకులు హాజరుకానున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. బండి సంజయ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ సైకిళ్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా నేరుగా టెన్త్ విద్యార్థులకే అందాలనే లక్ష్యంతో ఆయా సైకిళ్లను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందజేస్తున్నారు. వారి ద్వారా నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ చదివే విద్యార్థులందరికీ పంపిణీ చేస్తారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అధికారులతోపాటు బీజేపీ నాయకులు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో
మొత్తం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 20 వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ భావించారు. అనేక మంది పేద విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి విజ్ఝప్తులు వస్తుండటంతో ఈ సంఖ్యను 25 వేల సైకిళ్లకు పెంచేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 వేలకుపైగా సైకిళ్లను పంచాలని భావిస్తున్నారు. తొలుత జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాల్లో టెన్త్ విద్యార్థినీ, విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే విద్యార్ధినీ, విద్యార్థుల సంఖ్య 3841. వీరుగాక సరస్వతి శిశు మందిరాల్లో చదువుకునే విద్యార్థులు అదనం. తొలుత వీరికి సైకిళ్లను పంపిణీ చేస్తారు.
ఆ తరువాత సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ వంద నుండి 2 వందల చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అట్లాగే గ్రామ పంచాయతీల వారీగా 25 నుండి 50 వరకు సైకిళ్లను పంపిణీ చేయాలనుకుంటున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 25 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు.
ఇప్పటికే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవ్గంలో 5 వేల సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమం ఐదు రోజుల క్రితమే కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఎల్లుండి నుండి మరో 5 వేల సైకిళ్లను సిరిసిల్ల జిల్లాలో పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా మంగళవారం సిరిసిల్ల టౌన్ తోపాటు తంగళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే విద్యార్ధినీ, విద్యార్థులకు మాత్రమే సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత జిల్లాలోని ఇతర మండలాలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు.
*టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే....*
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.