రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి: సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని తాళ్ళపెల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన సీపీఐ సీనియర్ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ సావనపెల్లి మల్లేశం కుటుంబాన్ని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. మల్లేశం చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన మల్లేశం శ్రామికులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం ప్రజాపోరాటాలు చేశారని కొనియాడారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పక్కనే మిడ్ మానేర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కందికట్కూర్ గ్రామానికి చెందిన రైతు సావనపెల్లి పరశురామ్ 15 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయగా, నీరందక పంట పూర్తిగా ఎండిపోయి నష్టపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే వెంకట్రావుపల్లె, గొల్లపల్లి గ్రామాల మధ్య 2018 నుంచి పెండింగ్లో ఉన్న సరిహద్దు వివాదాన్ని అధికారులు చొరవ తీసుకుని శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, మంద అనిల్ కుమార్, మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
0 Comments