అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి

అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి  • మూడు రోజుల పాటు శాంతియుత ఉపవాస దీక్షలు

• అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ 

 న్యూస్ పవర్ ,3 అక్టోబర్ ,ఇల్లంతకుంట:


కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ డిమాండ్ చేశారు. శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చి, ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని ఆయన తీవ్రంగా విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఈ పథకాన్ని అమలు చేయకపోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అవమానపరచడమేనని, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను చైతన్యపరుస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు శాంతియుత ఉపవాస దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంలో, అలాగే దేశ చరిత్రలోనే అత్యంత విప్లవాత్మకమైన ఈ రోజుల్లో ఈ దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోరాటానికి అంబేద్కర్ వారసులు, కార్మికులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని రాకేష్ పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments