వెల్జీపురం సబ్‌స్టేషన్‌కు రూ.3.76 కోట్లు మంజూరు
•రైతుల 20 ఏళ్ల లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
• ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో నిధుల కేటాయింపు
• సర్పంచ్ నాయిని నవీన్ కుమార్‌కు మంజూరు పత్రం అందజేత
న్యూస్ పవర్, 3 అక్టోబర్, ఇల్లంతకుంట:
గత రెండు దశాబ్దాలుగా తీవ్రమైన లో-వోల్టేజ్ సమస్యతో అల్లాడుతున్న వెల్జీపురం పరిసర ప్రాంతాల రైతులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. వెల్జీపురం, ఓబులాపురం, చిక్కుడువానిపల్లె, రామోజీపేట గ్రామాల విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.3.76 కోట్ల అంచనా వ్యయంతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది.
మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఈ నిధులను మంజూరు చేయించారు. ఈ ప్రక్రియలో సహకరించిన డీఈ అంజయ్య, ఏఈ గుడెల్లి శ్రీనివాస్, ఏఈ నగేష్, లైన్ ఇన్‌స్పెక్టర్ వంగపల్లి రఘుపతి రెడ్డి, గ్రామ విద్యుత్ సిబ్బంది కనకయ్య, నరేష్‌ల సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సబ్‌స్టేషన్ మంజూరు అధికారిక పత్రాన్ని వెల్జీపురం సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ కి స్వయంగా అందజేశారు.
ఈ నిర్ణయంపై సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా వెంకటేశం, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక రైతులు, గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో-వోల్టేజ్ సమస్యలతో పంటల సాగుకు తీవ్ర ఆటంకం కలిగేదని, నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చి రైతులకు కొండంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను కొనియాడారు.
సమస్య పరిష్కారానికి అహర్నిశలు శ్రమించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి, ఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులకు, సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బందికి సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
0 Comments