తాళ్లపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
న్యూస్ పవర్ ,9 అక్టోబర్ ,ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు, గ్రామ మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ మీసాల కనకరాజు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మన సంస్కృతిని భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయులు కె. శ్రీనివాస్ రెడ్డి, కామల్ల రజిత, ఏఏపీసీ చైర్‌పర్సన్ మీసాల లీల, అంగన్‌వాడీ టీచర్ స్వప్న, ఆయా మమతతో పాటు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
0 Comments