రాత్రి వేళ బస్సు సౌకర్యం లేక ప్రయాణికుల ఇక్కట్లు

రాత్రి వేళ బస్సు సౌకర్యం లేక ప్రయాణికుల ఇక్కట్లు


 న్యూస్ పవర్ , 30 అక్టోబర్ , ఇల్లంతకుంట:
 సిద్దిపేట డిపో నుంచి ప్రతిరోజూ రాత్రి ఇల్లంతకుంట వైపు నడిచే ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలో రేపాక, సోమారంపేట గ్రామాల మీదుగా నడవకపోవడంతో ఆయా గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సును తిరుగు ప్రయాణంలోనూ రేపాక, సోమారంపేట మీదుగా నడపాలని స్థానికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

సిద్దిపేట నుంచి బయలుదేరే బస్సు అల్లీపూర్, రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లె మీదుగా ఇల్లంతకుంటకు చేరుకుంటుంది. అయితే ఇల్లంతకుంట నుంచి సిద్దిపేటకు తిరిగి వెళ్లే సమయంలో వెంకట్రావుపల్లె, అల్లీపూర్ మీదుగా నేరుగా సిద్దిపేటకు వెళ్తుండటంతో రేపాక, సోమారంపేట ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యార్థులు, మహిళలు, కూలీలు, చిరు వ్యాపారులు తమ గ్రామాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లేక ప్రైవేటు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని, అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట డిపో అధికారులు స్పందించి, తిరుగు ప్రయాణంలోనూ రేపాక, సోమారంపేట మీదుగా బస్సును నడపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment

0 Comments