ఇల్లంతకుంట ప్యాక్స్ (PACS) పదవుల్లో మాదిగలకు తీరని అన్యాయం: అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు సావనపెల్లి రాకేష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించడంలో దళితులకు, ముఖ్యంగా మాదిగలకు తీరని అన్యాయం చేసిందని అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ మండిపడ్డారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి సమన్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పొందుపరిచిన స్ఫూర్తిని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ తుంగలో తొక్కారని విమర్శించారు. ఎమ్మెల్యే అగ్రవర్ణ బడా నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇల్లంతకుంట మండలంలో ఎస్సీ జనాభాలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలకు ఇల్లంతకుంట ప్రాథమిక సహకార సంఘంలోని 12 నామినేటెడ్ పదవుల్లో ఒక్కటి కూడా కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని, ఇది యావత్ మాదిగ జాతిని తీవ్రంగా అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మాదిగలపై సాగుతున్న ఈ రాజకీయ అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 10న రౌండ్ టేబుల్ సమావేశం:
మాదిగల రాజకీయ హక్కులను కాలరాస్తూ సాగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా, మాదిగల ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఈ నెల 10వ తేదీన ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా "రౌండ్ టేబుల్ సమావేశం" నిర్వహిస్తున్నట్లు రాకేష్ వెల్లడించారు.
ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ (MRPS) నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు మరియు ప్రతి మాదిగ బిడ్డ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Post a Comment