ఫెర్టిలైజర్ యాప్‌లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేక ఎరువుల కేటాయింపు చేయాలి
రాజన్న సిరిసిల్ల / ఇల్లంతకుంట: ఎరువుల విక్రయానికి సంబంధించిన ‘ఫెర్టిలైజర్ సేల్ యాప్’ లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేకంగా ఎరువుల కేటాయింపులు జరపాలని కోరుతూ మండల రైతు ప్రతినిధులు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం కీలకమైన వ్యవసాయ సీజన్‌లో యూరియా తగినంతగా లభించక ఇల్లంతకుంట మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెర్టిలైజర్ సేల్ యాప్ ద్వారా జరిగే పంపిణీ ప్రక్రియలో ప్రత్యేక విభజన లేకపోవడంతో, ఇల్లంతకుంట మండలానికి కేటాయించిన యూరియా నిల్వలను ఇతర మండలాల రైతులు కూడా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల మండల రైతుల కోసం కేటాయించిన యూరియా అతి తక్కువ సమయంలోనే నిండుకొని, స్థానిక రైతులు ఎరువులు దొరక్క అల్లాడిపోతున్నారని వివరించారు.
మండలంలో రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, పంటల అవసరాలకు అనుగుణంగా యాప్‌లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేక కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి కోటాను ఇతరులు తీసుకెళ్లకుండా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక రైతులకు యూరియా సకాలంలో అందేలా డీలర్లకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అధికారి సానుకూల స్పందన: రైతుల సమస్యపై జిల్లా వ్యవసాయ అధికారి సానుకూలంగా స్పందించారు. వచ్చే 2-3 రోజుల్లోనే ఫెర్టిలైజర్ సేల్ యాప్‌లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేక కేటాయింపు కనిపించేలా సాంకేతిక చర్యలు తీసుకుంటామని, మండల రైతులకు యూరియా కొరత రాకుండా చూస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు చిమ్మనగొట్టు శ్రీనివాస్, మేకల మల్లేశం, మిట్టపల్లి మధుసూదన్ రెడ్డి, సామ సంతు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment