వరి నుంచి ఆయిల్ పామ్ సాగులోకి..
• ఇల్లంతకుంట మండలం దాచారంలో 19 ఎకరాల్లో వేసిన ఇద్దరు రైతులు
• పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
• ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 386 ఎకరాల్లో వరి నుంచి ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు
న్యూస్ పవర్ , 18 ఆగస్టు , ఇల్లంతకుంట:
సంప్రదాయ వరిసాగు నుంచి దీర్ఘకాలిక ఆదాయం సమకూరే ఆయిల్ పామ్ సాగులోకి పలువురు రైతులు మారారు. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన సురభి రవీందర్ రావు 10 ఎకరాలు, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలు తెలుసుకొని సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికారు. దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సురభి రవీందర్ రావు, సురభి సంతోష్ రావు ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.
క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు తో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్ లో జిల్లావ్యాప్తంగా 386 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు.
రైతులు ముందుకు రావాలి
ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన సురభి రవీందర్ రావు 10 ఎకరాలు, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. సాగు చేస్తున్న రైతులను అభినందించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. మూడు ఏండ్ల పాటు అంతర పంటలు వేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఆదాయం సమకూరుతుందని వివరించారు. సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు ఆయిల్ పామ్ సాగుతో ఏ ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment