ఇల్లంతకుంట:
మండల పరిధిలోని అనంతారం గ్రామంలో గల బిక్కవాగుపై వంతెన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై అక్కెం నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వంతెనను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ నేటికీ ఆ హామీని నెరవేర్చకుండా పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు కేవలం గన్నేరువరం ప్రజలే ఓట్లు వేశారా, ఇల్లంతకుంట మండల ప్రజలు ఓట్లు వేయలేదా అని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. గన్నేరువరం సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే, అదే చిత్తశుద్ధితో అనంతారం బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం కూడా దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గనుక దీక్షకు సిద్ధపడితే అందుకు కావాల్సిన ఫ్లెక్సీలు, పూలదండలు, ఇతర సామగ్రి ఖర్చులన్నింటినీ తానే స్వయంగా భరిస్తానని స్పష్టం చేశారు.
వంతెన పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో బ్రిడ్జికి ఇరువైపులా నిత్యం తీవ్ర ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు అనంతారం–రహీంఖాన్‌పేట రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారిందని, దీంతో మోడల్ స్కూల్ విద్యార్థులు, రైతులు, గ్రామస్థులు రాకపోకలు సాగించలేక నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇల్లంతకుంట మండలంలోని దెబ్బతిన్న రోడ్లన్నింటికీ తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో సెప్టెంబర్ 21 నుంచి తానే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, బ్రిడ్జి సాధన కోసం ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Comments
Post a Comment