గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
న్యూస్ పవర్ , 7 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల పరిధిలో గంజాయి విక్రయిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల రూరల్ సిఐ కదిరె నాగేశ్వరరావు తెలిపారు.
రామోజీపేట గ్రామానికి చెందిన చింతమడక అజయ్, పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన కోడిముంజ సాయి అనే ఇద్దరు స్నేహితులు గత కొంతకాలంగా గంజాయికి బానిసలయ్యారు. కేవలం తామే కాకుండా, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లోని యువతకు కూడా గంజాయిని విక్రయిస్తున్నారు.
శనివారం అనంతారం శివారులో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 65 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టారు.విచారణ అనంతరం నిందితులిద్దరిని జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్కు తరలించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
