నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు. 34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...