రోడ్ల మరమ్మతుల కోసం 27న పాదయాత్ర

రోడ్ల మరమ్మతుల కోసం 27న పాదయాత్ర

 న్యూస్ పవర్ , 25 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని ప్రధాన రహదారులను వెంటనే బాగుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27 ఆదివారం నాడు భారీ పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రజా ఉద్యమకారుడు, అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ వెల్లడించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. ఇల్లంతకుంట నుండి అనంతారం మీదుగా రహీంఖాన్ పేట, వెల్జిపూర్, వల్లంపట్ల, ఒగులాపూర్, చీర్లవంచ, లక్ష్మీపూర్, తంగళ్లపల్లి వరకు రోడ్లు తీవ్రంగా గుంతలమయమై ప్రయాణికులకు నరకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, నాణ్యమైన తారు రోడ్డు  నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న అనంతారం బ్రిడ్జి, ఒగులాపూర్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు సురక్షితమైన రవాణాతో పాటు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11:00 గంటలకు ఇల్లంతకుంట బస్టాండ్ నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని, 28వ తేదీన జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రజా సమస్యపై రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.


Post a Comment

0 Comments